బిగ్బాస్ గ్రాండ్ ఫినాలేకి ముందు ప్రతి సీజన్లో టాప్-5 జర్నీ వీడియోలు చూపించడం ఆనవాయితీ. అయితే ఇందులో ఒక్కొక్కరి జర్నీ వీడియో ఒక్కో విధంగా చూపిస్తూ మంచి ఫీల్ ఇస్తుంటాడు బిగ్బాస్. ఇక దీని కోసం గార్డెన్ ఏరియాలో చేసే డెకరేషన్, సెలబ్రేషన్ మాములుగా ఉండవు. ఇక ఈ సీజన్ ఫైనలిస్టులకి కూడా జర్నీ వీడియోలను చాలా గ్రాండ్గా ప్లాన్ చేసింది బిగ్బాస్ టీమ్. నేటి ఎపిసోడ్లో గౌతమ్, అవినాష్లకి సంబంధించిన జర్నీలను చూపించాడు బిగ్ బాస్.
గార్డెన్ ఏరియాలో తన కోసం చేసిన గ్రాండ్ సెటప్ చూసి అవినాష్ చాలా సర్ప్రైజ్ అయ్యాడు. ముఖ్యంగా బిగ్బాస్ జర్నీలో అవినాష్ సాధించిన విజయాలు, ఎమోషన్స్, తన భార్య వచ్చినప్పటి ఫొటోలతో పెద్ద ఆల్బమ్ ఏర్పాటు చేశారు. ఇది చూసి అవినాష్ ఎమోషనల్ అయ్యాడు. అలానే ఎవిక్షన్ షీల్డ్, తను రెండో సారి మెగా చీఫ్ అయిన టాస్కుకి సంబంధించిన వస్తువులు చూసి ఒకసారి తన జర్నీని గుర్తుచేసుకున్నాడు. ఆ తర్వాత అవినాష్ గురించి చాలా గొప్పగా చెప్పాడు బిగ్బాస్. అవినాష్.. తెలియని సముద్రం భయాన్ని పెంచితే తెలిసిన సముద్రం అంచనాలను పెంచుతుంది.. ఈరోజు మీరు ఈ స్థానంలో నిలిచి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.. మీరు చుట్టూ ఉంటే ఉష్ణోగ్రత తనకి తానే కొన్ని డిగ్రీలు కోల్పోతుంది.. ఎన్ని డిగ్రీలు పొందినవారికైనా అది సాధ్యమవుతుందా చెప్పండి.. ఈ ఇంట్లో కొందరే మీ స్నేహితులైన అందరూ మీ ఆప్తులే.. మీ రింగుల జుట్టు మీ భార్యకి ఎంతో ఇష్టమైనప్పటికీ ఆట మీదున్న ప్రేమ కోసం దాన్ని త్యాగం చేశారు. ఈసారి అవినాష్ కామెడీ మాత్రమే చెయ్యగలిగే జస్ట్ కమెడియన్ కాదు.. అన్నీ చేయగలిగే కంప్లీట్ ఎంటర్టైనర్లా మిమ్మల్ని మీరు ఆవిష్కరించారు.. అవినాష్ ఈ ప్రంపంచంలో అన్ని అనారోగ్యాల నుంచి ఉపశమనాన్ని ఇచ్చే దివ్య ఔషధం నవ్వు ఒక్కటే.. ఆ నవ్వును పంచే మీరు అందరికంటే ఐశ్వర్యవంతులంటూ బిగ్బాస్ చెప్పాడు.
ఈ మాటలకి అవినాష్ కంటతడి పెట్టుకున్నాడు. జస్ట్ కమెడియన్ మాత్రమే కాదు ఎంటర్టైనర్ అని బిగ్బాస్ చెప్పినప్పుడు అవినాష్ ఫేసులో చాలా ఆనందం కనిపించింది. ఇక బిగ్బాస్ మాటలు పూర్తికాగనే విజిల్ వేసి థాంక్యూ అంటూ గట్టిగా అరిచాడు అవినాష్. తన జర్నీని ఇంత గ్రాండ్గా ప్లాన్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ చెప్పాడు.